రాజీనామా చేస్తాన‌న్న స్పీక‌ర్.. శ‌భాష్ అన్న సీఎం జ‌గ‌న్‌..!

0
1025

ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం రాజీనామా చేస్తానంటూ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఆస‌క్తికరంగా మారాయి. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ముందే త‌మ్మినేని సీతారాం ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం విశేషం. ఇంత‌కీ రాజీనామా చేస్తానంటూ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం అన‌డం వెనుక ఉన్న కార‌ణ‌మేంటి..? అందుకు సీఎం జ‌గ‌న్ ఇచ్చిన రియాక్ష‌న్ ఏంటి..? అన్న ప్ర‌శ్న‌ల‌కు సంబంధించి అస‌లు వివ‌రాలు ఇలా ఉన్నాయి.

కాగా, సీఎం జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి రాష్ట్రంలో అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అందులో ప్ర‌ధానంగా కృష్ణాన‌ది క‌ర‌క‌ట్ట‌పై నిర్మించిన అక్ర‌మ నిర్మాణాల‌పై వైసీపీ ప్ర‌భుత్వం దృష్టి సారించింది. టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో నిర్మిత‌మైన ప్ర‌జావేదిక భ‌వ‌నం, చంద్ర‌బాబు అన‌ధికార నివాసం లింగ‌మ‌నేని గెస్ట్ హౌస్ కూడా ఉంది. ఇప్ప‌టికే ప్ర‌జావేదిక కూల్చివేత ప‌నులు పూర్తికాగా, లింగ‌మ‌నేని గెస్ట్‌హౌస్‌తోపాటు మ‌రికొన్ని అక్ర‌మ క‌ట్ట‌డాల‌కు అధికారులు నోటీసులు అంద‌జేశారు.

తాజాగా, ఇదే విష‌యం ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ స‌మావేశాల్లోనూ ప్రస్తావ‌న‌కు వ‌చ్చింది. ప్రజా వేదిక‌ను ప్ర‌భుత్వ అవ‌స‌రాల నిమిత్తం ఉప‌యోగించుకోవాలంటూ సుప్రీం కోర్టు చెప్పినా, సీఎం జ‌గ‌న్ కేవ‌లం త‌న‌పై క‌క్ష‌తోనే ఆ భ‌వ‌నాన్ని కూల్చేశారంటూ మాజీ సీఎం చంద్ర‌బాబు అసెంబ్లీ సాక్షిగా అధికార పార్టీపై విమ‌ర్శ‌ల‌వ‌ర్షం కురిపించారు.

ప్ర‌స్తుతం ముఖ్య‌మంత్రిగా ఉన్న జ‌గ‌న్ గ‌తంలో ఎంపీగా, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉన్న స‌మ‌యంలో వైఎస్ఆర్ విగ్ర‌హాల‌ను వేల సంఖ్య‌లో అక్ర‌మ స్థ‌లాల్లో ఏర్పాటు చేశార‌ని చంద్ర‌బాబు ఆరోపించారు. అలా విజ‌య‌వాడ న‌డిబొడ్డున అక్ర‌మంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్ర‌హాన్ని టీడీపీ హ‌యాంలో తీయించేశామ‌ని చంద్ర‌బాబు గుర్తు చేశారు.

వైఎస్ఆర్‌పై త‌న‌కు వ్య‌క్తిగ‌త క‌క్ష‌లేద‌ని, వైఎస్ఆర్ తన‌కు బెస్ట్‌ఫ్రెండ్ అని చంద్ర‌బాబు చెప్పారు. తామిద్ద‌రం మంత్రులుగా ఉన్న స‌మ‌యంలో ఒకేరూమ్‌ను షేర్ చేసుకున్నామంటూ చంద్రబాబు పాత రోజుల‌ను గుర్తు చేశారు. వైఎస్ఆర్‌, త‌న మ‌ధ్య ఉన్న‌ది కేవ‌లం రాజ‌కీయ విరోద‌మే త‌ప్ప‌.. వ్య‌క్తిగ‌త క‌క్ష‌లు కాద‌ని చంద్ర‌బాబు క్లారిటీ ఇచ్చారు.

ఇదే సంద‌ర్భంలో వైఎస్ఆర్ విగ్ర‌హాల తొల‌గింపు అంశాన్ని త‌ప్పుబ‌డుతూ అధికార‌పార్టీ స‌భ్యులు ఆందోళ‌న‌కు దిగి, త‌మ అభిమాన నాయ‌కుడిని అవ‌మానించేలా చంద్ర‌బాబు వ్యాఖ్యలు చేయ‌డాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. ఇంత‌లో స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం సైతం క‌లుగ‌జేసుకుని చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌ను అసెంబ్లీ రికార్డుల నుంచి తొల‌గించాలంటూ పోడియంలో కూర్చున్న అధికారుల‌ను ఆదేశించారు.

ఆందోళ‌న‌కు దిగిన అధికార పార్టీ స‌భ్యుల‌ను ఉద్దేశించి స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం మాట్లాడారు. మీ ఫీలింగ్స్ ఎలా హ‌ర్ట్ అయ్యాయో త‌న‌కు తెలుస‌ని, ముఖ్యంగా ద‌ళిత, గిరిజ‌న, ముస్లిం మైనార్టీలు, బ‌డుగు బ‌ల‌హీన‌వ‌ర్గాల‌కు సంక్షేమ కార్య‌క్ర‌మాల‌తో ద‌గ్గ‌రైన వ్య‌క్తి దివంగ‌త సీఎం వైఎస్ఆర్ అని చెప్పారు. తాను కూడా ఒక బీసీగా స్పీక‌ర్ చైర్‌లో కూర్చొని ఉన్నాన‌ని, మీకు ఉన్న‌టువంటి హ‌క్కుల‌ను ప‌రిర‌క్షించిన‌ప్పుడే తాను కూర్చున్న కుర్చీకి గౌర‌వం ఉంటుంద‌ని స్పీక‌ర్ అన్నారు. మీ హ‌క్కుల‌ను ప‌రిర‌క్షించ‌లేన‌ప్పుడు తాను శాస‌నస‌భాప‌తిగా త‌ప్పుకుంటానంటూ త‌మ్మినేని సీతారం క‌రాఖండిగా చెప్పారు. త‌మ్మినేని సీతారం మాట‌లు విన్న సీఎం జ‌గ‌న్‌తో స‌హా అధికార‌పార్టీ స‌భ్యులు బ‌ల్ల‌ల‌ను చ‌రుస్తూ అభినందించారు. ఇలా గ‌తంలో త‌మ్మినేని సీతారాం స్పీక‌ర్‌గా ముక్కుసూటిగా వ్య‌వ‌హ‌రిస్తూ అంద‌రిచేత శెభాష్ అనిపించుకుంటున్నారు.