సీఎం జ‌గ‌న్ కేసులో.. ఈడీకి గ‌ట్టి షాక్‌..!

0
300

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఆస్తుల కేసులో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌)కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. గ‌తంలో జ‌గ‌న్‌కు సంబంధించిన ఆస్తుల‌ను అటాచ్‌చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ తీసుకున్న నిర్ణ‌యాన్ని అప్పిలేట్ అథారిటీ త‌ప్పుబడుతూ ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఈడీచేసిన ఆస్తుల అటాచ్‌మెంట్‌ను కూడా ర‌ద్దు చేసింది.

అయితే, దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో పెన్నా సిమెంట్ సంస్థ ఏర్పాటుకు ఉదారంగా భూములు ఇచ్చి ల‌బ్దిచేకూర్చార‌ని, అందుకు ప్ర‌తిఫ‌లంగా పెన్నా సిమెంట్ సంస్థ ప్రతినిధి పెన్నా ప్ర‌తాప్‌రెడ్డి వైఎస్ జ‌గ‌న్ కంపెనీలో పెట్టుబ‌డులు పెట్టార‌న్న‌ది ఈడీ అధికారుల అభియోగం.

ఈడీ అభియోగం కార‌ణంగానే పెన్నా ప్ర‌తాప్‌రెడ్డికి చెందిన 7.85 కోట్ల రూపాయ‌ల ఆస్తుల‌ను అధికారులు జ‌ప్తు చేశారు. అంతేకాకుండా అనంత‌పురం జిల్లా యాడికి మండ‌లంలోని పెన్నా సిమెంట్స్ ఏర్పాటుకు కేటాయించిన భూముల‌ను సైతం ఈడీ అధికారులు వారి ఆధీనంలోకి తీసుకున్నారు. తాజాగా ఈ వ్య‌వ‌హారంపై విచార‌ణ జ‌రిపి అథారిటీ అప్పిలేట్
ఈడీ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది.

అప్పిలేట్ అథారిటీ ఈడీనీ ప్ర‌శ్నిస్తూ.. వైఎస్ఆర్ ప్ర‌భుత్వ హ‌యాంలో ఏడున్న‌ర కోట్ల రూపాయ‌ల ల‌బ్ది చేకూరినందున జ‌గ‌న్ కంపెనీలో 53 కోట్ల రూపాయ‌ల విలువైన ముడుపుల‌ను ఏ కంపెనీ అయినా పెట్టుబ‌డిగా పెడుతుందా..? అని ప్ర‌శ్నించింది. ఈడీ కేవ‌లం ఆరోప‌ణ‌ల ఆధారంగానే అభియోగాలు న‌మోదు చేసిన‌ట్టుగా ఉంద‌ని అప్పిలేట్ అథారిటీ అభిప్రాయ‌ప‌డింది.

ఇలా ఆరోప‌ణ‌ల‌తోనే కేసులు న‌మోదు చేయ‌డం స‌రికాద‌ని, అక్ర‌మంగా పెన్నా సిమెంట్ సంస్థ‌కు భూములు క‌ట్ట‌బెట్టారంటూ ఒక్క రైతు అయినా ఫిర్యాదు చేశాడా..? అని ఈడీని అప్పిలేట్ అథారిటీ ప్ర‌శ్నించింది. స్వ‌తంత్ర సంస్థ‌గా ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ సొంతంగా ఆధారాల‌ను సేక‌రించిన త‌రువాత‌నే విచార‌ణను ముందుకు తీసుకెళ్లాల‌ని, కేవ‌లం ఆరోప‌ణ‌ల‌ను ఆధారంగా తీసుకుని ఇత‌ర‌ల‌ను ఇబ్బంది పెట్ట‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బ‌ని హెచ్చ‌రించింది.