జ‌న‌సేన‌తో పొత్తుపై బోండా ఉమా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..!

0
351

టీడీపీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్రబాబుతో కాపు నేత‌ల స‌మావేశం సోమ‌వారం ముగిసింది. ఓటమికి కార‌ణాల‌తోపాటు, కాపునేత‌ల స‌మ‌స్య‌ల‌ను చంద్ర‌బాబు వ‌ద్ద ప్ర‌స్తావించారు. పార్టీ మారే ఆలోచ‌న లేద‌ని కాపు నేత‌లు స్ప‌ష్టం చేశారు. వ‌చ్చే లోక‌ల్‌బాడీ ఎల‌క్ష‌న్స్‌లో గెలుపు కోసం ప్ర‌య‌త్నిస్తామ‌న్నారు.

సార్వ‌త్రిక ఎన్నిక‌లు ఏ విధంగా జ‌రిగాయి..? ఓట‌మికి గ‌ల కార‌ణాలు ఏంటి..? అన్న అంశాల‌తోపాటు కాకినాడ‌లో చ‌ర్చించుకున్న విష‌యాల‌ను చంద్ర‌బాబు దృష్టికి తీసుకురావ‌డం జ‌రిగింద‌ని కాపు నేత‌లు మీడియాకు తెలిపారు. ఎక్క‌డ లోపాలు జ‌రిగాయి..? టీడీపీ ఎందుకు ఓట‌మిపాలైంది..? అన్న అంశాల‌తోపాటు, గ్రౌండ్ లెవ‌ల్‌లో వ‌ర్క్ అనుభ‌వాల‌ను కాపు నేత‌లు చంద్ర‌బాబుకు క్షుణ్ణంగా వివ‌రించారు.

చంద్ర‌బాబు కూడా అన్ని విధాలా ప్ర‌జ‌ల కోస‌మే ప‌నిచేద్దాం.. అపోహ‌లు.. అనుమానాల‌కు తావులేదు.. కాపు నేతలంతా టీడీపీవైపే ఉన్నారు.. టీడీపీని బ‌లోపేతం చేసి మ‌ర‌లా అధికారంలోకి తీసుకురావ‌డం కోసం ప్ర‌జ‌ల‌తోటి ఉండాల‌ని పార్టీ నేత‌ల‌కు సూచించారు.

ఇదే విష‌య‌మై స‌మావేశం ముగిసిన అనంత‌రం మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మీడియాతో మాట్లాడారు. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ట్టు కాకినాడ‌లో ఎక్క‌డా కూడా కాపు నేత‌లు ర‌హ‌స్య స‌మావేశాలు నిర్వ‌హించ‌లేద‌న్నారు. అలాగే తామంతా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాడుతామ‌ని, ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తిప్పికొడ‌తామ‌న్నారు. జ‌న‌సేన‌తో పొత్తు విష‌య‌మై మాట్లాడుతూ ఆ అంశాన్ని భ‌విష్య‌త్తే నిర్ణ‌యిస్తుంద‌ని బోండా ఉమా వ్యాఖ్యానించారు.