జ‌గ‌న్ కేబినెట్ నుంచి న‌లుగురు ఔట్‌?

0
301

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన కేబినెట్ ను ఏర్పరిచి సరిగ్గా నెలన్నర కూడా కాలేదు. అప్పుడే కొంతమంది మంత్రులపై ఆరోపణలు వస్తుండ‌టంతో వారిని సాగ‌నంపాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌జ‌యించిన‌ట్టు వైసిపి వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. జగన్ మోహన్ రెడ్డి మొదటి నుంచి చెబుతూ ఉన్నారు.. అవినీతిని సహించేది లేదని. తొలి కేబినెట్ భేటీలో కూడా ఇదే విషయాన్ని ఒకటికి పదిసార్లు నొక్కి చెప్పారు. అవినీతి ఆరోపణలు వస్తే… ఎవరినీ ఉపేక్షించేది లేదని గట్టిగానే హెచ్చరించిన ఫ‌లితం లేక పోయింద‌ని, కొందరు దీనిని సీరియస్ గా తీసుకోలేదన్న వార్త‌లు వినిపిస్తున్నాయి.

వీరిలో ఒక మహిళా మంత్రి స‌హా న‌లుగురు మంత్రులు ఉన్నార‌ని, వీరి వ్య‌వ‌హారంపై కూపీ లాగితే ఆశ్చ‌ర్య‌పోయే వాస్త‌వాలు తెలిసి జ‌గ‌న్ అవాక్క‌య్యార‌ట‌. మ‌హిళా మంత్రి సంబంధిత శాఖ వ్యవహారాల్లో ఆవిడ భర్త గారి జోక్యం పెరిగిందని, అయిన దానికి కాని దానికి అధికారుల‌ను స‌తాయించ‌డంతో పాటు ఏ ప‌నికి ఎంత వ‌స్తుంది, త‌మ‌కి ఎంత పంపుతారంటూ ప‌దే ప‌దే అడుగుతున్నార‌ని అధికార వ‌ర్గాల నుంచే ఆరోపణలు వినవస్తున్నాయ‌న్న‌ది వైసిపి వ‌ర్గాల క‌థ‌నం.

అలాగే మరో సీనియర్ మంత్రి , తన సొంత జిల్లాకు అంతా తానే అన్నట్టుగా వ్యవహరిస్తుండ‌టంతో ఇత‌ర శాస‌న‌స‌భ్యుల మాట‌కు విలువ‌నివ్వ‌ద్ద‌ని, ఏ విష‌య‌మైన త‌న దృష్టికి తీసుకురావాల‌ని హుకుంజారీ చేయ‌టంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌లో మంత్రి గారి అనుచ‌ర వ‌ర్గం దందాకి తెర‌లేపార‌ట‌. ఇక‌ మరొక మంత్రి గారు… ఓ పని కోసం రెండుకోట్ల రూపాయలు ఖ‌ర్చుల కింద ఇవ్వాల‌ని చెప్పార‌ని, మరొక మంత్రి గారు… ఓ విద్యా సంస్ధ విషయంలో ఆమ్యామ్యాల‌డిగార‌ని , ప్ర‌తి ఒక్క‌రి వ్య‌వ‌హార శైలిపై దృష్టి సారించిన సిఎం ఈ నలుగురు మంత్రులకు వార్నింగ్ ఇవ్వడం కూడా ఇప్పటికే పూర్తయిందని విన‌వ‌స్తోంది.

కాగా వార్నింగుతో వదిలిపెట్టకూడదని, సాగనంపడమే మంచిదని సీఎం జగన్ నిర్ణయించారన్న చర్చ కూడా పార్టీ అంత‌ర్గ‌తంగా సాగుతోంది. అసెంబ్లీ స‌మావేశాల త‌దుప‌రి చ‌ర్య‌లుండొచ్చ‌ని పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత ఒక‌రు మీడియాకు ఈ విష‌య‌మై ఉప్పందించారు.