ఏపీ మంత్రి భార్య టోల్ రచ్చ

0
208

ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మకు టోల్ గేట్ దగ్గర పరాభవం ఎదురైంది. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి గుంటూరుకు కారులో వెళ్తున్న ఆమెను నల్గొండ జిల్లా మాడ్గులపల్లి వద్ద ఉన్న టోల్‌గేట్ సిబ్బంది ఆపారు. టోల్ ఫీజు చెల్లించాలని వారు కోరడంతో ఆమె సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాను ఏపీ మంత్రి భార్యని అని, ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న వాహనాన్ని ఎలా ఆపుతారంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నంతమాత్రాన టోల్‌ఫీజు చెల్లించనంటే కుదరదని, ఎమ్మెల్యే ప్రయాణించే వాహనానికి మాత్రమే ఆ వెసులుబాటు ఉంటుందని స్పష్టం చేశారు. పైగా స్టిక్కర్ కాలపరిమితి కూడా ముగిసినందున ఫీజు చెల్లించాల్సిందేనని పట్టుబట్టారు.

ఈ సందర్భంలో టోల్ సిబ్బందికి, మంత్రి భార్యకు తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. చివరికి ఆమె టోల్ ఫీ రూ.56 చెల్లించి వెళ్లిపోయారు. నెలలో మూడు నాలుగు సార్లు తాను గుంటూరు-హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగిస్తుంటానని, ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని మంత్రి భార్య ఆవేదన వ్యక్తం చేశారు.