రూ.10 కోట్ల‌పై క్లారిటీ ఇచ్చిన ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి భార్య : వివేకా హ‌త్య కేసులో మరో ట్విస్ట్‌..!

0
1014

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మొద‌ట‌గా దివంగ‌త ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి తండ్రి రాజారెడ్డి హ‌త్య కేసులో నిందితుడైన రాగిపిండి సుధాకర్‌రెడ్డిపై ఆరోప‌న‌లు రాగా, ఆయ‌న త‌న‌కు సంబంధం లేద‌ని చెప్పారు. ఆ త‌రువాత నాలుగు రోజులుగా క‌నిపించ‌కుండా పోయిన వైఎస్ వివేకానంద‌రెడ్డి అత్యంత సన్నిహితుడు ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డిపై అనుమానాలు గుప్పుమ‌న్న సంగ‌తి తెలిసిందే. దీంతో తిరుప‌తి ఆస్ప‌త్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి వైఎస్ఆర్ కుటుంబానికి న‌మ్మిన‌బంటు, అంతేకాక వైఎస్ వివేకానంద‌రెడ్డికి అత్యంత స‌న్నిహితుడు కూడా. ఇదే క్ర‌మంలో వివేకానంద‌రెడ్డి హ‌త్య జ‌రిగిన రోజు నుంచి ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి క‌నిపించ‌కుండా పోయాడు. వివేకానంద‌రెడ్డి హ‌త్య జ‌రిగేంత వ‌ర‌కు ఇంట్లోనే ఉన్న ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి త‌రువాత ఆరోగ్యం బాగాలేదని చెప్పి భార్య‌తో క‌లిసి వెళ్లిపోయాడు. దీంతో వివేకానంద‌రెడ్డి హ‌త్య‌తో ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డికి సంబంధం ఉంద‌ని అనుమానిస్తూ అత‌న్ని అదుపులోకి తీసుకుని సిట్ అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు.

మ‌రోవైపు వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కు, త‌మ‌కు ఎటువంటి సంబంధం లేద‌ని ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి దంప‌తులు అంటున్నారు. వివేకా హ‌త్య‌కు రెండు రోజుల ముందే ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి ఆస్ప‌త్రిలో చేరాడ‌ని అత‌ని భార్య చెబుతోంది. వైఎస్ కుటుంబంతో 30 ఏళ్లుగా అనుబంధం ఉంద‌ని, వివేకానంద‌రెడ్డి త‌మ‌కు దేవుడితో స‌మాన‌మ‌ని, కొంత మంది కావాల‌నే త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

త‌మ‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అన్నా.. విజ‌యమ్మ అన్నా.. భార‌తి అన్నా త‌మ‌కు అభిమాన‌మేన‌న్నారు. ఇక వైఎస్ వివేకానంద‌రెడ్డి త‌మ‌కు దేవుడితో స‌మాన‌మ‌ని చెప్పారు. వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో త‌మ‌కు రూ.10 కోట్లు ముట్టిన‌ట్లు వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌మ‌ని వారు ఖండించారు.